దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేతకు రక్షణ కవచంలా ఉండే కార్యకర్తలు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వారిని వేళ్లపై లెక్కపెట్టోచ్చు. అధికార పార్టీలో ఉండటమే రాజకీయం అన్నట్లుగా నేటి రాజకీయ నేతలు మారిపోతున్నారు. కానీ, తెలుగు దేశం పార్టీకి ఆ పరిస్థితి లేదు. ఆ పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువే. తెలుగుదేశం ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అండగా చాలా మంది నేతలు, కార్యకర్తలు రక్షణ కవచంలా నిలిచారు. అలాంటి వారిలో ఒకరు కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ సహా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టారు. నేతలపైనే కాదు.. ఏకంగా చంద్రబాబు నాయుడుపైనే అక్రమ కేసులు పెట్టి జైలు పంపించారు. ఆ సమయంలో పార్టీకి అన్నివిధాల అండగా నిలిచిన తెలుగుదేశం నేతల్లో దండమూడి చౌదరి ఒకరు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ శ్రేణులపై సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ 2023 జనవరి నెలలో నల్లచొక్కా ధరించి దండమూడి చౌదరి దీక్ష పూనాడు. ఆ రోజు నుంచి నల్లచొక్కాను ధరిస్తూ జగన్ పాలనపై నిరసన తెలుపుతూ వచ్చారు. జగన్ అరాచక పాలన నుంచి ప్రజలకు అండగా ఉంటూ.. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ముందుకు సాగారు. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దండమూడి చౌదరి చంద్రబాబును కలిసి బాబు చేతుల మీదుగా పసుపు చొక్కాను స్వీకరించి నల్లచొక్కా దీక్షను విరమించాడు. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తూనే, జగన్ అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చిన దండమూడి చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. పసుపు చొక్కాను చౌదరి భుజాలపై కప్పి మున్ముందు పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ, అదే సమయంలో ప్రజల ఇబ్బందులను తొలగించేలా పార్టీ తరపున కృషిచేయాలని చంద్రబాబు సూచించారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ పాలనపై దృష్టిసారించారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తల బాగోగులపైనా చంద్రబాబు దృష్టి సారించారు. తన క్యాబినెట్ ఎంపికలోనూ ఆ మార్క్ చూపించారు. రాబోయే కాలంలో.. గత ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతలను, కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టేందుకు చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దండమూడి చౌదరికి కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చజరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ, పార్టీ బలోపేతానికి కష్టపడే నేతలకు తెలుగుదేశంలో ఏ విధంగా న్యాయం జరగబోతుందో రాబోయే కాలంలో చంద్రబాబు చూపించబోతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నాయి.