ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి ఆకాశానికెత్తేసిన వారు ఇప్పుడు పార్టీ పతనానికి, తమ ఓటమికి కారణం జగనే అంటూ వేలెత్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ ను నిందించారు. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణా అదే బాట పట్టారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్ తీరేనని అన్యాపదేశంగానైనా తన అనుచరుల వద్ద కుండ బద్దలు కొట్టేశారు.
పార్టీలో ప్రజా ప్రతినిథులు, కార్యకర్తలకు పూచిక పుల్లెత్తి విలువ కూడా ఇవ్వకుండా ఐప్యాక్’ అనే ఓ పనికిమాలిన సంస్థని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. పార్టీలో ఉండేవారికి దక్కాల్సిన సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇవ్వలేదన్నది పార్టీలోని ప్రతి ఒక్కరి అభిప్రాయం అని అందరి తరఫునా తానే చెప్పేశారు. ఐప్యాక్ కి రాజకీయాలతో సంబంధం ఏమిటి? నా రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని విద్యాధికులను ఎక్కడ నుంచో పట్టుకొచ్చి మా నెత్తిన కూర్చోబెట్టి జగన్ దిద్దుకోలేని తప్పు చేశారని కొట్టు సత్యానారాయణ ఇప్పుడు గళమెత్తుతున్నారు.
అలా బయట నుంచి వచ్చిన ఐప్యాక్ ప్రతినిథులు వారి కౌపీన సంరక్షణార్థం తమపై జగన్ కు తప్పుడు నివేదికలిస్తే వాటిని పట్టుకుని తమను దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖని రాజధాని అంటూ ఐదేళ్లు ఉత్తుత్తి మాటలు చెప్పడం కూడా పార్టీ ఓటమికి కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే వాలంటీర్ల కారణంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజలతో ప్రత్యక్ష సంబధాలు కట్ అయిపోయాయనీ వాపోయారు.
ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి సీఎంవోలో ఉండే అధికారులు కూడా ఎమ్మెల్యేలు, జగన్ మధ్య దూరం పెంచడానికి ఇతోథికంగా దోహదపడ్డారని, ఆ కారణంగానే ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోక పార్టీ పట్ల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోవడానికి కారణమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలా గురించి ఏదో ఒకటి చెప్పగలరు. అన్ని తప్పులు చేసిన జగన్ ఇంకా తనను ఎవరో మోసం చేశారని చెప్పుకోవడం తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది.