బుద్ధుడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు రెండూను; బుద్ధుడు మత ఆచార్యుడు(priest), రాజు రెండూను అని అంతర్జాతీయ చరిత్రకారులు, పరిశీలకులు A k Coomaraswamy, I B Horner లు 1940 లలోనే తమ Gotama the Buddha పుస్తకంలో మిలిందపన్హా (225-227)ను ఉటంకిస్తూ తెలియజేశారు.
బుద్ధుడి కాలం సామాన్య శకానికి పూర్వం (BCE) 477-397 ఆని ప్రఖ్యాత చరిత్రకారుడు K.T.S. Sarao తెలియజేశాడు. ఒకదశ తరువాత బుద్ధుడు ఒక సన్యాసిగా, కొందరు అనుచరులతో జీవించాడు. జీవిత కాలంలో బుద్ధుడు సమాజాన్ని పెద్దగా ప్రభావితం చెయ్యలేదు. ఆయన కాలానికి ఆయన కన్నా జైన మహావీరుడు అన్ని రకాలుగానూ ప్రజల్లో ప్రబలంగా ఉండేవాడు అన్నది సరైన చరిత్ర.
బౌద్ధం 4వ శతాబ్దికే మన దేశంలో క్షీణించి పోయింది. మన దేశంలో ఎప్పుడూ జైనంలా ఒక సంస్కృతి అన్న స్థాయిలో బౌద్ధానికి స్థానం రాలేదు. మన దేశంలో జైనంలాగా బౌద్ధం ఇళ్లల్లో ఉన్న మతం లేదా కుటుంబ మతం అన్న స్థితిలో లేదు. ‘బౌద్ధం మన దేశంలో ఒక సంస్కృతిగా ఎప్పుడూ లేదు, కాలేదు కాబట్టే జైనంలా అది నిలబడలేదు’. ‘బౌద్ధం మన దేశంలో కుటుంబ జీవన సంస్కృతిగా అవలేదు, కాదు కాబట్టే అది పూర్తిగా విఫలమైపోయింది’. ఇళ్లనూ, కుటుంబాలను విడిచి కొందరు ఆరామాలు అనబడే చోట్లకు వెళ్లి బుద్ధ స్ఫూర్తికి వ్యతిరేకంగా బౌద్ధులు అన్న పేరుతో భ్రష్ట జీవనం చేసేవారు. ఆ బౌద్ధ ఆరామాలు అసాంఘీక కార్యక్రమాలకు కేంద్రాలుగానూ, వ్యాపార లావాదేవీలకు కేంద్రాలుగానూ మారి ప్రజల ఏవగింపుకు గురౌవడంతో హూన వంశ పాలకులు తోరమాన రాజు, మిహిరకుల రాజు ఒకరి తరువాత ఒకరుగా బౌద్ధారామాల్ని ధ్వంసం చేసి బౌద్ధ గురువుల్ని, సన్యాసుల్ని తన్ని తరిమేశారు. అటు తరువాత ముస్లీమ్ దాడులు బౌద్ధాన్ని ఊచకోత కోశాయి (నా క్రితం వ్యాసాల్లో ఈ విషయాన్ని విపులంగా తెలియజేశాను). ఈ చారిత్రిక సత్యాల్ని, అంతర్జాతీయ అధ్యయనాల్ని తెలుసుకోగలిగే చదువు లేకుండానూ, హైందవంపై విద్వేషంతోనూ, సనాతనంపై దాడిగానూ, ఆదాయం కోసమూనూ, మన దేశ సామాజిక సామరస్యాన్ని దెబ్బ కొట్టే కుట్రలో భాగంగానూ కొందరు హిందూ మతం బౌద్ధాన్ని నిర్మూలించింది అని వికృతంగా, వికారంగా అసత్య ప్రచారం చేస్తున్నారు.
“సామాన్య శకం (C.E.) 4వ శతాబ్ది తొలి సంవత్సరాలకే భారతదేశంలో ప్రతి చోటా బౌద్ధమతం క్షీణ దశలో ఉంది” అని చైనీస్ యాత్రీకుడు ఫ హైన్ (Fa- Hien) తెలియజేసినట్టుగానూ, ఈ విషయాన్ని 7వ శతాబ్దిలో చైనీస్ యాత్రీకుడు హైయన్ సాంగ్(Hiuen- Tsang) గణాంకాలతో తెలియజేసినట్టుగానూ Thomas William Rhys Davids తన పుస్తకం BUDDHIST INDIA లో (పుట 318)లో లోకానికి తెలియజేశాడు. ఈ BUDDHIST INDIA పుస్తకం 1903లో వచ్చింది. (నెట్లో ఈ పుస్తకం ఉంది. ఎవరైనా ఈ విషయాన్ని చదివి తెలుసుకోవచ్చు) బౌద్ధం 4వ శతాబ్దికే మన దేశంలో క్షీణించి పోయింది అన్నది అంతర్జాతీయంగా తెలిసిన చారిత్రిక సత్యం.
భారతీయతపై ద్వేషంతో, నీతిలేని బ్రాహ్మణ వ్యతిరేకతతో మనదేశంలో బుద్ధుణ్ణి భ్రష్టుపట్టించేశారు; మన దేశంలో బుద్ధుడికి బురద పూసేశారు. చదువు లేనివాళ్లు, మందమతులు, అసాంఘీక శక్తులు, వంచకులు, నేరస్థులు, విదేశీ ధనాన్ని మరిగిన సనాతన వ్యతిరేకులు, విద్వేష వాదులు మనదేశంలో బుద్ధుణ్ణి బ్రష్టుపట్టించారు. ప్రపంచమంతా బుద్ధుణ్ణి సరిగ్గానే తెలుసుకుంది. బుద్ధుడు పుట్టిన ఒక్క మన దేశంలోనే బుద్ధుడు దారుణంగా వక్రీకరించబడ్డాడు. మన దేశంలో రాజకీయ, సామాజిక కుట్రలో భాగంగా ఏ ఆధారాలూ లేకుండా కులానికీ, నాస్తికత్వానికి, హిందూ వ్యతిరేక భావజాలానికి బుద్ధుణ్ణి మూర్తిమత్వం చేశారు; బుద్ధుణ్ణి బుద్ధుడు కాకుండా చేస్తున్నారు. బుద్ధుడి గుఱించి తెలుసుకోవాలంటే సరైన పుస్తకాలు చదవాలి; అంతర్జాతీయ అధ్యయనాన్ని చదవాలి. కనీసం ఒక్క ధమ్మపదంను సరిగ్గా చదివినా చాలు. బుద్ధుడు వైదిక లేదా సనాతన వాది అని తెలిసిపోతుంది.
బుద్ధుడి మాట:
(ధమ్మపదం అధ్యాయం 1 శ్లోకం 5 )
న హి వేరేన వేరాని
సమ్మన్తీధ కుదాచనం
అవేరేన సమ్మన్తి
ఎస ధమ్మో సనన్తనొ
అర్దం:
వైరంవల్ల వైరం
మానదు ప్రపంచంలో;
(అవైరం) ప్రేమవల్లే మానుతుంది
ఇది సనాతన ధర్మం.
‘సనాతన ధర్మం’ అన్నది ఇక్కడ బుద్ధుడి మాటగా రావడం మనకు తెలుస్తోంది.
బుద్ధుడి గుఱించి అంతర్జాతీయ పరిశీలకుడు koenraad Elst చెప్పిన వాటిని తెలుసుకోవాలి. Elst Buddha అని నెట్ లో వెతికితే మనకు సరైన విషయం తెలుస్తుంది. Edwin Arnold రాసిన Light Of Asia బుద్ధుడు ఎంత సనాతనుడో తెలియజెబుతుంది. Dwight Goddard రాసిన A Buddhist Bible, ఇంకా A k Coomaraswamy, I B Horner, Geoffrey Parrinder వంటివాళ్ల అంతర్జాతీయ అధ్యయనాల్ని, చరిత్రకారులు H.C. Raychaudhari, H. Bhattacharya, K.P. Jayaswal, Eric Seldeslachts వంటివాళ్ల రచనల్ని చదివితే మన దేశంలో బుద్ధుడు, బౌద్ధం పరంగా కొందరు చేసిన, చేస్తున్న వక్రీకరణ ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. బుద్ధుడు సనాతనుడు లేదా హిందువు అని ప్రపంచమంతా విరివిగా చెప్పబడింది, చెప్పబడుతోంది.
బుద్ధుడి సనాతనత్వాన్ని లేదా వైదికత్వాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం…
ఈ కింది శ్లోకంలో బుద్ధుడు యజ్ఞ ప్రస్తావన చేస్తున్నాడు…
మూల పాలీ శ్లోకం:
(ధమ్మపదం – అధ్యాయం 26 శ్లోకం 10)
|| యంహా ధమ్మం విజానెయ్య
సమ్మా సంబుద్ధ దేసితం
సక్కచ్చం తం నమసెయ్య
అగ్గి హుత్తం వ బ్రాహ్మణొ. ||
ధమ్మపదం వల్ల జ్ఞాని అయిన వ్యక్తికి నమస్కరించాలి. బ్రాహ్మణుడు యజ్ఞాగ్ని (అగ్ని హుత్తం)కి చేస్తున్నట్లుగా.
ఇక్కడి యజ్ఞ అగ్నిని జ్ఞానిగా చూపాడు బుద్ధుడు. అంటే యజ్ఞాగ్నిని పరిగణించడమే కాదు దాన్ని ఉత్కృష్టమైంగా కూడా బుద్ధుడు చెప్పాడు. మన దేశంలో బుద్ధుడు చుట్టూ అసత్యాలు పేర్చబడ్డాయి. ఆ అసత్యాల్ని కూల్చేసి మనం సరిగ్గా బుద్ధను తెలుసుకుందాం.
ఈ కింది శ్లోకంలో బుద్ధుడు, మంత్రం, జపం అంటున్నాడు…
మూల పాలీ శ్లోకం:
(ధమ్మ పదం, అధ్యాయం 18- శ్లోకం 7)
|| అసజ్ఝాయ మలా మంతా
అనుట్ఠాన మలా ఘరా,
మలం వణ్ణస్స కొ సజ్జం
పమాదొ రక్ఖతొ మలం ||
|| జపంలేని మంత్రం మలం.
ఉత్థానం లేకపోవడం గృహానికి మలం
బద్ధకం అందానికి మలం.
నిర్లక్ష్యం (ప్రమత్తత) రక్షకుడికి మలం. ||
ఇక్కడ బుద్ధుడు “జపం,మంత్రం” అంటున్నాడు. మంత్రం, జపం అన్నవి ఏ చింతనకు ప్రతీకలు? ఆలోచించాలి.
(తైవాన్ బౌద్ధావలంబనలో మంత్రాల వాడుక ఎంతో బలంగా సాగుతూ వస్తోంది.)
బుద్ధుడు వైదికం లేదా హైందవం వ్యక్తి’ అని అంతర్జాతీయ అధ్యయనాలు ఘంటాపథంగా తెలియజేస్తున్నాయి…
MAYFIELD PUBLISHING COMPANY- CALIFORNIA ప్రచురించిన
The Story Of World Religions పుస్తకంలో రచయితలు Denise Lardner, John Carmody ఇలా తెలియజేస్తున్నారు:
1
“the legend says, on the urging of the god Brahma– did the Buddha resolve to present to men (and women) the truth he had realized”.
2
“The Buddha himself came to enlightenment through meditation. He was indebted to yogic masters of the Hindu tradition…”
3
” In both the Therevada and Mahayana camps the more intellectual strains of Indian yoga continued to hold pride of place. Buddhism did develope devotional religious rituals that bear some similarity to Hindu bhakti (although most Buddhists would frown on any erotic over tones), but they did not develope their own equivalents of the Hindu physical yogas…”
THE USBORNE ENCYCLOPEDIA OF WORLD RELIGIONS వంటి అంతర్జాతీయ ఆకర గ్రంథాలు బుద్దుడు హిందువుగా పుట్టాడని, బుద్ధుడు హిందువని విశ్వవ్యాప్తంగా ఉద్ఘాటిస్తున్నాయి. సనాతన ధర్మమే హిందూ మతం అని Geoffrey Parrinder వంటి అంతర్జాతీయ పరిశోధకులు, పండితులు తెలియజెబుతూ వేదాలు, మనుస్మృతి, ఉపనిషత్తులు బుద్ధుడికన్నా పూర్వంవి అని నిగ్గు తేల్చి లోకమంతా చాటారు. బుద్ధుడు సనాతనుడు అన్నది జగమెరిగిన సత్యం.
“బుద్ధుడి మూల బోధలు వైదిక లేదా సనాతనత్వానికి వ్యతిరేకమైనవి కావు” అని అంతర్జాతీయ బౌద్ధ పరిశోధకుడు, పండితుడు ఎకె.కూమారస్వామి 1943లోనే విశ్వవ్యాప్తంగా ఘోషించాడు. బుద్దుడి గురించి చెబుతూ Chambers Biographical Dictionary “అతడి (బుద్ధుడి)విధానం ఒక కొత్త మత విశ్వాసం అవడంకన్నా బహుశా బ్రాహ్మణ మత పునర్నిర్మాణం అవుతుంది” అని అవగాహననిచ్చింది.
బుద్ధుడిపై స్వామి వివేకానంద విశేషమైన విశ్లేషణలు చేశారు. “బుద్ధుడు వేదసారాన్ని తెలియజెప్పాడు” అనీ, “ఈ గురువు (బుద్ధుడు) సత్యాన్ని సత్యంగా ప్రకాశించేట్టు చెయ్యాలనుకున్నారు” అనీ, “ఒక్క బుద్ధుడు మాత్రమే అన్నీ ఇతరులకు చేసి తనకంటూ బొత్తిగా ఏమీ చేసుకోని యోగి (ప్రవక్త)” అనీ, “బుద్ధుడి బోధలోని ప్రతీది వేదాంతంలో ఉంది” అనీ “వేదాంతం బౌద్ధానికి పునాది” అనీ “వేదాంతానికి బౌద్ధంతో ఘర్షణ లేదు” అనీ వివేకానందస్వామి వివరించారు.
సరైన చదువు, సరైన ఆలోచన, సరైన దృక్పథం లేనివాళ్లకు అతీతంగానూ, కులోన్మాదులకు అతీతంగానూ అసాంఘీక శక్తులకు అతీతంగానూ విద్వేషవాదులకు అతీతంగానూ, విదేశీ డబ్బుతో సనాతనాన్ని దెబ్బకొట్టి దేశ సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చెయ్యాలన్న కుట్రలకు అతీతంగానూ బుద్ధుణ్ణి తెలుసుకోవాలి. ఆ పని చేద్దాం. బుద్ధుడి పరంగా బుద్ధిలేని తనాన్ని చదువుతో తరిమికొడదాం. (బుద్ధుడు, బౌద్ధం పరంగా వికృతాల్ని, అసత్యాల్ని ఖండిస్తూ అంతర్జాతీయ ఆధారాలతో ఈవరకే కొన్ని వ్యాసాల్ని రాశాను)
మనదేశంలో బుద్ధుడికి ఎప్పుడూ ఏ ప్రాముఖ్యతా రాలేదు, లేదు. కానీ ఇవాళ బుద్ధుడు ప్రాతిపదికగా మన దేశ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అవాంఛనీయమైన, అపాయకరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి; బుద్ధుడు, బౌద్ధం విషయ వక్రీకరణలతో, ఆసత్యాలతో భారతీయత’పై దాడి జరుగుతోంది. మనం అప్రమత్తం కావాలి.