తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడి ముగిసీముగియగానే పాలనపై దృష్టి పెట్టారు. శనివారం ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా రుణమాఫీకి నిధుల సమీకరణ విషయంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. తొలి నుంచీ కూడా లోక్ సభ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ చేపడతానని రేవంత్ చెబుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుని వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లలకు ప్రాతినిథ్యం లేదు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణలో రేవంత్ ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కేబినెట్ విస్తరణపై కూడా మంత్రవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులుండగా ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురు ఉన్నారు. మహబూబ్నగర్ నుంచి అయితే సీఎంతో పాటు మరొక మంత్రి ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి ఒక మినిస్టర్ ఉన్నారు. ఒక సామాజికవర్గాల వారీగా చూస్తే రేవంత్ కేబినెట్ లో ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉన్నారు. మొత్తంగా కేబినెట్ భేటీలో మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్యా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపైనా, ఆగస్టు 15 లోగా చేయాల్సిన రుణమాఫీకి నిధుల సమీకరణపైనా కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంపైనా, ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపైనా కూడా కేబినెట్ చర్చిస్తుందని అంటున్నారు.