వైసీపీ పతనం ఇది ఆరంభం మాత్రమేననీ, వచ్చే ఐదేళ్లలో ఆ పార్టీ మరింతగా దిగజారడం ఖాయమనీ, ఇందు కోసం తాను అలుపెరుగని పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వాస్తవానికి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ యుద్ధమే చేశారు. తెలుగుదేశం, జనసేనలకు మించి విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి, మద్యం విధానం, వాగ్దానాలు అమలులో వైఫల్యం, జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులను వంచించిన వైనంతో పాటు సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యవిషయంలో న్యాయం జరగాలంటూ ఆమె ఇచ్చిన పిలుపు ఇవన్నీ జగన్ కు ఆయన పార్టీ నేతలకు నిద్రలేని రాత్రులను మిగిల్చాయంటే అతిశయోక్తి కాదు. షర్మిల జగన్ పై రాజకీయ పోరాటం చేస్తుంటే.. జగన్, ఆయన పార్టీ నేతలు మాత్రం షర్మిల వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ కువిమర్శలకు దిగారు. చివరాఖరికి స్వయంగా జగన్ కూడా సొంత చెల్లి షర్మిల కట్టుకున్న చీర రంగుపై కామెంట్లు చేశారు.
ఎన్నికలకు ముందు వరకూ షర్మిల కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి అవినాష్ రెడ్డిపై విజయం సాధిస్తారన్న భావన వైసీపీ నేతలతో సహా అందరిలోనూ ఉండేది. అప్పట్లో ఆమె ప్రచారానికి వచ్చిన స్పందనే అందుకు కారణం. అయితే షర్మిల కడపలో పరాజయం పాలయ్యారు. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అందరూ దాదాపుగా డిపాజిట్లు కోల్పోయారు. సరే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత, అందునా జగన్ పార్టీ ఈ ఎన్నికలలో 11 స్థానాలకే పరిమితం కావడం నిస్సందేహంగా షర్మిలకు సంతోషం కలిగించే విషయమే అయినా కూడా ఆమె షర్మిల ఎక్కడా బయటకు రాలేదు. మీడియాతో మాట్లాడలేదు. దీంతో షర్మిల కాడె వదిలేశారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో మొదలైంది.
అయితే ఆమె తాజాగా షర్మిల ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ హై కమాండ్ తనకు మద్దతుగా ఉన్నారని పేర్కొనడమే కాకుండా తమ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారని షర్మిల తెలిపారు. రానున్న రోజులలో ఏపీలో కాంగ్రెస్ పూర్వవైభవం సాధించడమే కాకుండా, ఒక బలీయ శక్తిగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో వచ్చే ఐదేళ్లలో జగన్ ఓటు బ్యాంకు లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేయనున్నదని స్పష్టమౌతోంది. జగన్ భయం కూడా అదే. షర్మిల తన దూకుడు ఇలాగే కొనసాగితే.. వైసీపీ ఓటు బ్యాంకు అంతా షర్మిల కాంగ్రెస్ కు మళ్లించేయడం ఖాయమన్న భయం జగన్ లోనూ వ్యక్తం అవుతున్నదని అంటున్నారు.