ఏపీలో పోలింగ్ పూర్తయ్యింది. ఓటరు తీర్పు సురక్షితంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలు మరింత భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నాయి. పోలింగ్ పూర్తై మూడు రోజులు గడిచినా రాష్ట్రంలో మాత్రం ఇంకా హై టెన్షన్ వాతావరణం అలాగే ఉంది. రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో రగిలిపోతున్నాయి. సాధారణంగా పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొనడం ఆ తరువాత చల్లారిపోవడం సహజమే. అయితే ఈ సారి మాత్రం పోస్ట్ పోల్ హింస పెచ్చరిల్లుతోంది.
గత ఎన్నికల కంటే రెండు శాతానికి మించి అధికంగా పోలింగ్ జరగడం అధికార వైసీపీలో ఆందోళనకు కారణమైంది. అందుకే ఉదయం చెదురుమదురు సంఘటనలు వినా ప్రశాంతంగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి వైసీపీ మూకలు చెలరేగిపోవడంతో హింసాత్మకంగా మారింది. పోలింగ్ సరళిని బట్టి ఆందోళనకు గురైన వైసీపీ అధినాయకత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే వైసీపీ మూకలు పోలింగ్ సజావుగా జరగకుండా, ఓటర్లు ధైర్యంగా క్యూలలో నిలబడి ఓటు వేసే పరిస్థితి లేకుండా చేయడానికి ప్రయత్నించాయన్నది పరిశీలకులు విశ్లేషణ. సరే మళ్లీ అదే పరిశీలకులు హింసాకాండకు బెదరకుండా ఓటర్లు ధైర్యంగా, ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనీ, ఇదే వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలియజేస్తోందని కూడా చెప్పారు.
అదే పోలింగ్ సరళి తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. ఇక అధికార పార్టీ ఆగడాలను మౌనంగా భరించనవసరం లేదన్న ధైర్యాన్ని నింపింది. పోలింగ్ తరువాత పల్నాడు, రాయల సీమలో వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో తెలుగుదేశం శ్రేణులు నిర్భీతిగా ముందుకు కదలడానికి అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో పోలింగ్ తమకు వ్యతిరేకంగా జరిగిందని వైసీపీ కీలక నేతలు, కొందరు అభ్యర్థులూ మీడియా ముందు అంగీకరిస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం కూటమికి అన్నివిధాలుగా మద్దతుగా నిలిచారనీ, తమను మాత్రం ఎక్కడికక్కడ నియంత్రించారనీ అంబటి, సజ్జల వంటి వారు ఆరోపణలు గుప్పించారు. సజ్జల అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పని చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మాటలన్నీ వైసీపీలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతున్నాయి. అలాగే వైసీపీ అడ్డాలుగా చెప్పబడే ప్రాంతాలలో పోలింగ్ అనంతర హింసాకాండను నిలువరించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినా తెలుగుదేశం కేడర్ ధైర్యంగా నిలబడి అడ్డుకోవడం ఆయా ప్రాంతాలలో మారిన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వైసీపీ కంచుకోటలను ఓటర్లు బీటలు వారేగా చేశాయనడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక ఎన్నికల తరువాత ఆ పార్టీ అధినేత జగన్ తీరు క్యాడర్ లో ఉత్సాహాన్ని చంపేసింది. ఆయన పూర్తిగా మౌనముద్రలోకి వెళ్లిపోవడం, రేపో మాపో విదేశీ పర్యటనకు రెడీ అయిపోవడంతో క్యాడర్ లో విశ్వాసం సన్నిగిల్లింది. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో హింసాకాండను ఖండించాల్సిన బాధ్యత కలిగిన హోదాలో ఉన్నారు. అయినా ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకీ మౌనం అంటూ జగన్ ను వైసీపీ క్యాడర్ నిలదీస్తోంది. ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన క్యాడర్ కు ఓదార్పు కలిగేలా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమేమిటన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. మరోవైపు విపక్ష నేత చంద్రబాబు ఎన్నికల హింసను ఖండిస్తూ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కానీ జగన్ వైపు నుంచి అటువంటిదేమీ లేదు. ఇదే ఆయనలోని నైరాశ్యానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం క్యాడర్ లో ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నింపడానికైనా విజయం మనదే అన్న భరోసా ఇవ్వడానికి కూడా జగన్ ముందుకు రాలేదంటే ఫలితంపై ఆయన అభిప్రాయం ఏమిటన్నది అవగతమైపోతోందంటున్నారు. ఇక జగన్ మౌత్ పీస్ లాంటి సజ్జల బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోకండి అంటూ వైసీపీ క్యాడర్ కు సలహాలిస్తూ మన సీన్ అయిపోయిందన్న సంకేతాలిస్తున్నారు.