ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన అటకెక్కింది. జనం ఛీ కొట్టి మరీ గద్దె దింపేశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో గెలిపించి అందలం ఎక్కించిన జనమే జగన్ ఐదేళ్ల పాలనతో విసిగి, వేసారి ఐదేళ్లకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేసి విపక్షంగా గొంతెత్తే అర్హత కూడా లేదని ఓటు ద్వారా ఆ పార్టీని ఊడ్చిపారేశారు. ఇప్పుడు ప్రజాతీర్పు ప్రభావం ఆ పార్టీ చేతిలో ఉన్న స్థానిక సంస్థలపైనా పడుతోంది. దౌర్జన్యాలతో, దాష్టీకాలతో స్థానిక సంస్థలపై ఆధిపత్యం సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు వాటిని కూడా కొల్పోయే పరిస్థితిలో పడింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్, మార్కాపురం, కందుకూరు, చీరాల మునిసిపాలిటీలు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు మేజర్ పంచాయతీల్లో వైసీపీ అధికారం కొల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు ఇప్పడు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేతి నుంచి తెలుగుదేశం చేతుల్లోకి రావడానికి ఎంతో కాలం పట్టదని అంటున్నారు.
తాజా ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అద్భుత ఫలితాలు సాధించింది. ప్రజలు వైసీపీని పూర్తిగా తిరస్కరించారు. దీంతో ఇప్పుడు జిల్లాలోన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా ప్రజాభీష్టం మేరకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు తమ లాయల్టీని మార్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా ఒంగోలులో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పాపం మాజీ ఎమ్మెల్యే, జగన్ కు బంధువు బాలినేని ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేజారకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఒంగోలు కార్పొరేటర్లు, మేయర్ తో భేటీ అయ్యారు. వారిని పిలిపించుకుని మరీ మట్లాడారు.
అయితే సమావేశంలో బాలినేని మాటలకు సానుకూల స్పందన కరవైందని ఆ భేటీ తరువాత కార్పొరేటర్లే మీడియాకు లీక్ చేశారు. ఈ భేటీ గత మంగళవారం జరిగగిందని చెబుతున్నారు. మొత్తం 38 మంది కార్పొరేటర్లకు గాను ఈ భేటీకి 27 మంది హాజరయ్యారు. మేయర్ సుజాత అయితే ఇప్పటికే తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆమెతో పాటుగా తెలుగుదేశం గూటికి చేరడానికి మెజారిటీ కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. వీరంతా ఇప్పటికే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో టచ్ లో ఉన్నారనీ, ఆయన ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకోవడం ఖాయమని అంటున్నారు.