ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి వేవ్ లేదని రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర శర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేవ్ లెస్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలను ఎన్డీయేలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీ బోలెడంత రాజకీయ లబ్ధి పొందిందని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నిటిలోనూ తెలుగుదేశం పార్టీయే శక్తమంతమైనదని చెప్పిన ఆయన ఆ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా జీరో స్టేక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని స్థానాలను బీజేపీ దక్కించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.
అన్నిటికీ మించి ఐదేళ్ల పాటు ఏపీలో అధకారంలో ఉన్న వైసీపీకి అన్ని విధాలుగా అండదండలు అందించి, ఇరు పార్టీల మధ్యా ఏదో రహస్య బంధం ఉందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడేలా చేసుకున్న బీజేపీ.. చివరి నిముషంలో తెలివిగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపడం ఆ పార్టీకి కచ్చితంగా ఎన్నికల లబ్ధి చేకూరుస్తుందని అన్నారు.
అన్ని విధాలుగా తమ అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహరించిన, ఇక ముందు కూడా వ్యవహరించక తప్పని స్థితిలో ఉన్న వైసీపీని కాదని, సమస్యలపై, రాష్ట్ర ప్రయోజనాలపై గట్టిగా నిలబడి నిలదీసే చంద్రబాబును ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ వ్యూహకర్తలు వాస్తవికంగా ఆలోచించారనీ, ఉత్తరాదిలో ఏదో మేరకు బీజేపీ నష్టపోతున్నదన్న అంచనాల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా దక్షిణాదిలో ఆమేరకు బలం పెంచుకోనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీతో జత కట్టిందని ఆయన విశ్లేషించారు.
ఇక సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన ఐదు విడతల పోలింగ్ లో బీజేపీకి సంతృప్తికర ఫలితాలు వస్తాయన్న భావన పరిశీలకుల్లో వ్యక్తం కాలేదు. ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్న తమిళనాడు( ఇప్పటి వరకూ తమిళనాట బీజేపీకి పెద్ద స్టేక్ లేదు. అయితే జయ మరణం తరువాత ఏర్పడిన రాజకీయ వాక్యూమ్ ను భర్తీ చేయడానికి కమలనాథులు ప్రయత్నించారు. పోలింగ్ కు ముందు వరకూ కూడా తమిళనాట చెప్పుకోదగ్గ స్ధానాలు వస్తాయని భావించారు. అయితే పోలింగ్ సరళితో కమలనాథుల ఆశలు ఆవిరయ్యాయి. ) ఆ తరువాత కర్నాటక విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా క్షేత్ర స్థాయిలో ఉన్న బలంతో అక్కడ గతంలో కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించింది. అయితే పోలింగ్ సరళి చూసిన తరువాత బీజేపీలో ఆ ఆశ కూడా ఆవిరైపోయిందని అంటున్నారు.
ఇక శివసేన, ఎన్సీపీలను చీల్చిన కారణంగా మహారాష్ట్రలో కూడా బీజేపీ బాగా బలహీన పడిందని, ఆ పార్టీల చీలిక అంతిమంగా బీజేపీకే చేటు చేసిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ఏక్ నాథ్ షించే వర్గం శివసేన ఇప్పుడు రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజల సానుభూతి ఉద్ధవ్ థాక్రే వర్గానికి వరంగా మారే అవకాశాలు ఉన్నాయన్నది పరిశీలకులు అంచనా. అదే విధంగా ఎన్సీపీలోని చీలిక కూడా అంతిమంగా బీజేపీకి నష్టం చేస్తుందని చెబుతున్నారు.
అలాగే బీహార్ లో నితీష్ కుమార్ ను దగ్గరకు తీయడం కూడా ఆ రాష్ట్రంలో బీజేపీకి కొంపముంచే వ్యవహారంగానే మారింది. కేవలం ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం తరచూ కూటములను మార్చేసే నితీష్ కుమార్ పట్ల బీహార్ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోందనీ, ఆ కారణంగా కూడా ఆ రాష్ట్రంలో నితీష్ తో పాటు బీజేపీ కూడా భారీగా నష్టపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
ఇన్ని నష్టాల మధ్య బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడం వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీ చెప్పుకోదగ్గ స్థానాలలో పొలిటికల్ గెయిన్ సాధిస్తుందని రుచిర్ శర్మ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వేవ్ లేని ఈ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి ఒక వేళ అధికారంలోకి వస్తే.. ఆ కూటమిలో శక్తిమంతమైన పార్టీగా తెలుగుదేశం నిలుస్తుందని చెబుతున్నారు.