- తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం పై 45 మంది నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం
దేశమంతా ఎన్నికల వేడి, ఫలితాలపై ఉత్కంఠ ఉంటే తెలంగాణలో మరో వివాదం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! ఈ వివాదం అటు ఇటు తిరిగి చివరకు మరో ఉద్యమానికి దారి తీస్తుందా? సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి ఇప్పటికే తన ధిక్కార స్వరం రెండు వేదికలపై వినిపించారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు! తొందర నిర్ణయాలు ఇబ్బందులు తెచ్చి పెడతాయని అనుకున్నారో ఏమో రాష్ట్ర చిహ్నం మార్పు వాయిదా వేసుకున్నారు! 45 మంది నాయకులతో సచివాలయంలో అత్యవసర కీలక సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు!
తెలంగాణ రాష్ట్ర గీతం గురించి పట్టించుకోని గత పాలకులు సైతం ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు! తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అద్భుత కవి, గేయ రచయిత, వాగ్గేయకారుడు! ఇందులో ఎలాంటి సందేహం లేదు! ఆ పాట కూడా బాగానే వచ్చింది! 80 వేల పుస్తకాలు చదివిన కెసిఆర్ కు మాత్రం ఆ పాటలో కొన్ని పదాలు నచ్చలేదు! ఆయన మంచి మూడ్ లో వున్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి ముందుకు వెళదాం అన్నారు! అది అందెశ్రీ కి నచ్చలేదు! దాంతో ఆ గీతం నిర్లక్ష్యానికి గురైంది. మూలన పడిపోయింది! అక్కడ నుంచి అందెశ్రీ కూడా కెసిఆర్ వైపు వెళ్ళలేదు! అతనే స్వయంగా ఆ పాటను కీరవాణి తో స్వరకల్పన చేయించాలని సంవత్సరం క్రితమే నిర్ణయించుకున్నారు ! డేట్స్ కుదరక అలా వాయిదా పడుతూ వచ్చింది!
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కొంచెం దూకుడుతనం మొదలైంది! వచ్చి రాగానే ప్రజాభవన్ కంచెలు కూల్చి గడీల పాలన మనకొద్దు, ప్రజా పాలన మాది అని చాటి చెప్పినప్పుడు అందరు హర్షించారు! కొన్నాళ్ళకు ఎన్నికల వేడి రగులుకుంది! ఆ హీట్ లోనే ఎన్నికల కోడ్ ఉండగానే తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తెచ్చుకున్నారు! ఆఘమేఘాల మీద తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ చిహ్నం రూపొందించాలని ఇటు అందెశ్రీ ని, అటు రుద్ర రాజేశం ను ఆహ్వానించారు. చర్చలు జరిపారు! ఆయన ఆలోచనలు చెప్పారు! వారికి స్వేచ్ఛనిచ్చారు!
అందెశ్రీ తనకు ఇష్టమైన కీరవాణి తో సంగీత స్వరకల్పన చేయించాలనుకున్నారు! రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు! పలు దఫాలు చర్చలు జరిపారు! ఇందులో మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మిత్రులు అద్దంకి దయాకర్, కోదండరాం వున్నారు!
కీరవాణిని ఎంపిక చేసుకున్నప్పుడే వివాదం రాజుకుంది! తెలంగాణ అధికారిక గీతానికి ఆంద్రోడి పెత్తనం ఏమిటంటూ విమర్శలు మొదలయ్యాయి! అసలు వారి హయాంలో పట్టించుకోని బిఆర్ఎస్ నేతలు సైతం ఇప్పుడు తీవ్ర విమర్శలు గురి పెట్టారు! అసలు వారే అప్పట్లో చేయించి ఉంటే ఇంత వివాదం ఉండేదా?
వేల కోట్ల కాళేశ్వరం కాంట్రాక్టు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తికి ఇచ్చినప్పుడు ఎవ్వరి నోళ్లు తెరచుకోలేదు! వేదాద్రి నూతన నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టించిన చిన జీయరు స్వామి ఎక్కడి వారు? సచివాలయ కాంట్రాక్టర్ ఎక్కడి వారు? వేదాద్రి రూపకర్త ఆనంద్ సాయి ఎక్కడి వారు? కవితమ్మ బతుకమ్మ పాటకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్, సంగీతం అందించిన రెహమాన్ ఎక్కడి వారు? అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడే ఎందుకు లేస్తున్నాయి? పండిన చెట్లకే రాళ్ళు వేయడం లోక సహజం అంటారా?
రాష్ట్ర చిహ్నంలో రాచరిక పాలన గుర్తులు ఎందుకు అంటూ కాకతీయ తోరణం, చార్మినార్ తొలగించారు! కొత్తగా రుద్ర రాజేశం రూపొందించిన మోడల్ జనంలోకి వదిలారు! అది సత్యమేవ జయతే అంటూ భారత దేశానికి చెందిన నాలుగు సింహాలు, అశోక చక్రం, అమరవీరుల స్థూపం, రైతన్నలను గుర్తు చేస్తూ వరి పంట ఏదో పెట్టారు! కాకతీయులు, నిజాం నవాబులు వద్దనుకున్నప్పుడు అశోకుడు ఎందుకు? దేశ చిహ్నం మళ్ళీ రాష్ట్ర చిహ్నంలో ఎందుకు? అమర వీరుల స్థూపం అసలు చిహ్నంలో ఎందుకు? అది శుభ సూచకం కూడా కాదు! అమర వీరుల కుటుంబాలకు శాశ్వత స్థిరత్వం కోసం సాయం చేయకుండా స్థూపం తీసుకొచ్చి రాష్ట్ర చిహ్నం లో పెట్టడం అరిష్టమే! తెలంగాణ పోరాటాల గడ్డ! సమ్మక్క సారక్క వీరోచిత తత్వం, చాకలి ఐలమ్మ పోరాటతత్వం, కాళోజీ, దాశరధి, సినారే లాంటి సాహిత్యం, తెలంగాణ మట్టి పరిమళం, మూసి నది ప్రతిబింబించేలా చిహ్నం రూపొందించి ఉంటే బావుండేది!
అందుకే ఇలాంటి సున్నిత విషయాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు ఉండకూడదు! మేధావులతో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు ఇవి! అహంభావ నిర్ణయాలు మంచిది కాదు! అందుకే రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 45 మంది నాయకులను ఆహ్వానించి చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇది మంచి పరిణామం.
కీరవాణి విషయంలో విమర్శలు కూడా మంచిది కాదు! కళాకారులకు, కళలకు ఆకాశమే హద్దు! సంగీతానికి ఎల్లలు లేవు! ఏ రాష్ట్రం వారు అయినా ఎక్కడైనా ప్రదర్శనలు చేసుకోవచ్చు! నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో సబబు కానీ, కళల విషయంలో ఈ పట్టింపు పనికి రాదు! అయినా కీరవాణి ఎక్కడో లేడు! హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు! ఆస్కార్ సాధించి తెలంగాణకే ఖ్యాతి తెచ్చారు! ఆయనకు సుదీర్ఘ అనుభవం వుంది! మారిన టెక్నాలజీ ప్రకారం పాటను సులభంగా ఎవరైనా కంపోజ్ చేయవచ్చు! కానీ ఆ సృజనాత్మకత, ఆ నేటివిటీ టచ్ అందరికి ఉండకపోవచ్చు! తెలంగాణలో అద్భుత గాయకులు, సంగీత దర్శకులు ఉన్నప్పటికీ అదృష్టం అవకాశం కీరవాణికే దక్కింది!
అయినా ఏదీ శాశ్వతం కాదు! ఇదీ అంతే! కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళి మార్చుకోవచ్చు! కీరవాణి సంగీతం బాగా కుదరక పోతే ఆ పాటను జనమే ఆదరించరు! చిహ్నం కూడా అంతే! ఇప్పుడు ఈ వివాదం చూస్తుంటే ఇది కూడా కొందరి రాజకీయ ఎత్తుగడల్లో భాగం అనిపిస్తోంది! 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురి అయిన కేసును పక్కా పక్కదారి పట్టించే ఎత్తుగడ ఏమో! ఏమైనా జరగవచ్చు! ఇది మాయా మేయ రాజకీయ జగంబు!