తెలంగాణ ఆవిర్భావ వేడుకల హంగామా గురువారం మొదలైంది! అఖిలపక్ష భేటీ నిర్వహించి రాష్ట్ర అధికార గీతానికి ఏకగ్రీవ ఆమోదం పొందడంతో వేడుకలు ఆరంభమయ్యాయి! ఈ భేటీలో స్పీకర్ ప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిపిఐ, సిపిఎం నేతలు, ఉద్యమ నేత కోదండరాం, మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, వి. హనుమంతరావు… ఇలా వివిధ వర్గాలకు చెందిన 45 మంది నాయకులు పాల్గొన్నారు. వీళ్లందరి ముందు కీరవాణి బృందం తెలంగాణ రాష్ట్ర అధికార గీతం వినిపించారు. అలాగే సంగీతం అందించిన వెర్షన్ కూడా వినిపించారు. అందరూ ఏకగ్రీవంగా హర్షద్వానాలతో ఆమోదం తెలిపారు. తెలంగాణకు వన్నెతెచ్చిన Maqdoom మోహియుద్దీన్ ను కూడా చేరిస్తే బావుంటుందని కమ్యూనిస్ట్ నేతలు సూచించడంతో వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి రచయిత అందెశ్రీ కి చెప్పారు. తప్పకుండా చేరుస్తాం అని ఆయన తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావేత్త చుక్కా రామయ్య ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. అఖిలపక్ష సమావేశానికి ఆయన్ని ఫోన్ లో ఆహ్వానించినప్పుడు అనారోగ్యంతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పడంతో స్వయంగా కలసి ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే అఖిలపక్ష సమావేశం పూర్తి చేసుకుని నల్లకుంట లోని వారి స్వగృహానికి నేరుగా వెళ్లి పరామర్శించి సన్మానించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గీతం, ఆవిర్భావ వేడుకల గురించి ఆయనకు వివరించారు.
గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యమ నేతలు మేధావులకు ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం లేదని, మొదటి సారి ఉద్యమ నేతలకు ఆహ్వానం అందింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు prof కోదండరాం. వేడుకలను స్వాగతిస్తున్నాం అని ఆయన ప్రకటించారు. రాష్ట్ర గీతం కీరవాణి సంగీత దర్శకత్వంలో అద్భుతంగా వచ్చిందని కితాబునిచ్చారు. రాష్ట్ర చిహ్నం మార్పు కోరుకుంటున్నామని, ఎలా ఉండాలో చర్చిస్తామని, సమయాభావం వల్ల చిహ్నం మార్పు వాయిదా వేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పారని కోదండరాం వివరించారు. కెసిఆర్ హయాంలో చిహ్నం మార్పులు గురించి చర్చ కూడా లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఇప్పుడు మార్చాల్సిన దుస్థితి ఏర్పడిందని కోదండరాం తెలిపారు.