సాధారణ ఎన్నికలు ముగింపునకు వచ్చేశాయి. శనివారం ( జూన్ 1) తుది విడత పోలింగ్ జరుగుతోంది. అంచనాలన్నీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నట్లుగానే ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి గట్టిగా పుంజుకున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అటువంటి తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు శనివారం (జూన్ 1) పసాయంత్రం 3 గంటలకు సమావేశమౌతున్నాయి.
ఈ సమావేశంలో సాధారణ ఎన్నికలు, ప్రచార సరళి, ఓటింగ్ జరిగిన తీరు, కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు, అదే విధంగా కౌంటింగ్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇలా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా జూన్ 4న ఫలితాల వెల్లడి తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక ఎగ్జిట్ పోల్స్ పై కూడా ఇండియా కూటమి భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ పై మీడియాలో జరిగే చర్చలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ కీలక నేతల సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా కూటమి నేతలంతా దాదాపుగా హాజరౌతున్నాయి.
అయితే ఇంతటి కీలక సమావేశానికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ డుమ్మా కొడుతున్నారు. ఏడవ విడతలో పశ్చిమ బెంగాల్ లోని 9 లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తాను సమావేశానికి హాజరు కావడం లేదని ఆమె ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో కూటమి ఐక్యతపై మరోసారి అనుమాన మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో మినహా మిగిలిన రాష్ట్రాల వరకూ తృణమూల్ ఇండియా కూటమి భాగస్వామ్యపక్షంగా ఉంటుందని మమతా బెనర్జీ ప్రకటించడం, ఆ తరువాత అవసరాన్ని బట్టి ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తాననడంతో తొలి నుంచీ ఆమె కూటమి విషయంలో కొంత దూరాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కీలక బేటీకి పోలింగ్ కారణంగా చూపుతూ డుమ్మా కొట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.