ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హాట్ సీట్ గా అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమేనని చెప్పవచ్చు. అటువంటి పిఠాపురంలో పోలింగ్ ముగిసిన తరువాత కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశా నిస్ఫృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్లేషకులు కూడా ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ సాధించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ జరుగుతుండగానే వైసీపీ చేతులెత్తేసినట్లు కనిపించింది. వైసీపీ అభ్యర్థి వంగా గీత పోలింగ్ బూత్ ల సందర్శన సందర్భంగా ఓటర్లతో పంచాయతీ పెట్టుకోవడం, అసహనం వ్యక్తం చేయడం ద్వారా పరిస్థితి తనకు, తన పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేదన్న సంకేతాలు ఇచ్చారు. సరే ఇప్పుడిక పోలింగ్ ముగిసిపోయింది. ఫలితం కూడా దాదాపు అందరికీ తెలిసిపోయింది. మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఆసక్తి వ్యక్తం అవుతోంది. గెలుపు ఓటములపై కాకుండా మెజారిటీపైనే నియోజకవర్గంలో బెట్టింగులు జరుగుతున్నాయి.
దీంతో జనసైనికులు ఇప్పుడు పిఠాపురంలో కొత్త హీరో అవతరించారంటూ ఆయనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ లాంటి హీరోను మించి కొత్త హీరో ఎవరంటూ ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే జనసైనికులుస్వయంగా తమ అధినేతను మించి ఆ కొత్త హీరోనే ప్రశంసలతో ముంచె త్తుతున్నారు. ఆ కొత్త హీరో ఎవరంటే స్థానిక తెలుగుదేశం నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఔను కూటమి శ్రేణులంతా ఆయననే హీరోగా అభివర్ణిస్తున్నారు.
కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే తెలుగుదేశంలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడి పని చేసి పార్టీని పటిష్టం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పిఠాపురం సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో ఎస్వీఎస్ఎన్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
అయితే ఎస్వీఎస్ఎన్ వర్మను చంద్రబాబు పిలిపించి మాట్లాడారో.. ఆ క్షణం నుంచీ నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిఠాపురంలో జనసేనానిని గెలిపించే బాధ్యతను వర్మ భుజానికి ఎత్తుకున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని విజయం ఖాయమనీ, అందుకు పూర్తి బాధ్యత తనదేననీ వర్మ చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కూ హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా తాను చంద్రబాబు శిష్యుడినననీ, ఆయన మాటే తనకు శిరోధార్యమనీ ప్రకటించారు. తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తిని మటుమాయం చేశారు. కూటమి అభ్యర్థి విజయానికి అందరినీ ఎకతాటిపైకి తీసుకువచ్చారు.
పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను దీటుగా తిప్పికొట్టడంలో వర్మ ప్రధాన పాత్ర పోషించారు. వర్మ పవన్ కల్యాణ్ ఉద్రేకంతో, ఉద్వేగంతో పొరపాట్లు చేయకుండా ఎక్కడికక్కడ నియంత్రించారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సినీ హీరో పక్కన ఉన్నారన్న మొహమాటం లేకుండా సూటిగా, నిక్కచ్చిగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ ప్రచారంలో భాగంగా ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినపుడు కళ్లతోనే వారించారు. అందుకు సంబంధించిన వీడియోను జనసైనికులే ఇప్పుడు వైరల్ చేస్తూ వర్మకు కృతజ్ణతలు చెబుతున్నారు. పిఠాపురంలో నిజమైన హీరో వర్మే అంటూ ప్రస్తుతిస్తున్నారు.