ఈమధ్యకాలంలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న నటి హేమకు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఆమె పరప్ప అగ్రహార జైలు ఉన్నారు. బెంగళూరు రూరల్ ఎన్డిపిఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చాలా రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు చేశారని, హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని ఆమె తరఫు న్యాయవాది మహేష్ కిరణ్‌శెట్టి వాదించారు. వాదనలు విన్న కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మే 20న బెంగళూరులోని జి.ఆర్. ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో బెంగళూరు పోలీసులు దాడి చేశారు. నటి హేమ ఆ రేవ్ పార్టీలో పట్టుబడిరది. అయితే తాను ఆ పార్టీలో లేనని, హైదరాబాద్‌లోనే ఉన్నానని నమ్మించేందుకు హేమ ప్రయత్నించింది. అయితే బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, అంతేకాకుండా మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధ్రువీకరించారు. విచారణకు హాజరు కావాలని రెండు సార్లు నోటీసులు పంపించినా ఆమె స్పందించకపోవడంతో మూడోసారి నోటీసులు జారీ చేశారు. అప్పుడామె విచారణకు హాజరు కాగా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెను సస్పెండ్ చేసింది. ఈ కేసు తేలే వరకు ఆమె సస్పెన్షన్ అమలులో ఉంటుందని ‘మా’ తెలియజేసింది.