జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారు. విద్యుత్ రంగంపై గత ప్రభఉత్వం మోపిన భారాలు, విద్యుత్ సంస్థల అప్పులపై చంద్రబాబు దృష్టి సారించారు. గత ఐదేళ్లలో ఎన్ని సార్లు విద్యుత్ చార్జిలు పెంచారు. ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు వంటి సకల వివరాలనూ అందజేయాల్సిందిగా చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత, మిగులు ఎంత అన్న వివరాలు సైతం సేకరించాల్సిందిగా ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత ఐదేళ్లలో పదే పదే విద్యుత్ చార్జీలు పెంచడమే కాకుండా, ట్రూఆప్, సర్దుబాటు చార్జీలు అంటే ఏకంగా తొమ్మిది సార్లు జగన్ సర్కార్ ప్రజలపై మోయలేని భారాన్ని మోపింది. చార్జీలు పెంచడం తప్ప విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టలేదు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించకపోవడానికి తోడు విద్యుత్ కోతలతో బతుకు నరకం చేసింది.
అసలు ఇన్నిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చింది? బయట ప్రైవేట్ మార్కెట్ నుంచి విద్యుత్ ఎంత కొనుగోలు చేశారు? అనే అంశాలపై లెక్కల నిగ్గు తేల్చాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువదీరగానే విద్యుత్ రంగంపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన తొలి మీడియాలో సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.