పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం లోని శ్రీ మోక్ష రామలింగేశ్వరాలయం లో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధ ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలన్న అవగాహన కార్యక్రమం లో భాగంగా ఆయన ఆదివారం నాడు రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్థచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.
శిల్ప శైలిని బట్టి ఈ బౌద్ధ చిహ్నం ఇక్ష్వాకుల కాలం నాటిదని వేంగి చాళుక్యుల కాలంలో ఆ స్తంభాన్ని బ్రహ్మ సూత్రాలను చెక్కి శివలింగంగా మార్చి మానవత్వంలో బిగించారని, భిన్నం కావడం వల్ల ఆలయం వెనుక పడేసారని శివనాగిరెడ్డి అన్నారు మరో రెండు శివలింగాలు క్రీస్తు శకం 16వ శతాబ్ది నాటి నిలువెత్తు వీరభద్ర విగ్రహం కూడా నిరాదరణకు గురి అయిందని ఈ విగ్రహాలపై స్థానికులకు ఆలయ పూజారులకు అవగాహన కల్పించి వీటిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ శిల్పి ఏలూరి శేష బ్రహ్మం, పరిశోధకుడు పి మహేష్, వారసత్వ ప్రేమికులు ఆర్ దశరధ రామిరెడ్డి, కే పూర్ణచంద్ర పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు.