ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఎలా ఉండబోతోందో సంకేతాలిచ్చేశాయి. ఇక మంగళవారం (జూన్ 4) అధికారికంగా ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే ఇప్పుడు ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆశక్తి దాదాపు ఎవరిలోనూ మిగలలేదు. తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమన్న నిర్ణయానికి దాదాపు అందరూ వచ్చేశారు. కనీసం విపక్ష హోదా అయినా వైసీపీకి దక్కుతుందా? అన్న విషయంపై ఓ కాస్త ఆసక్తి, ఉత్కంఠ మిగిలి ఉంది. చివరాఖరికి వైసీపీ నేతలూ, క్యాడర్ కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో వైసీపీ పార్టీలో జగన్ పై తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తోంది. తమ ఓటమికి, పార్టీ పరిస్థితికి జగన్ తీరే కారణమన్న విమర్శలు పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.
అసలు సిట్టింగులను మార్చాలన్న నిర్ణయంతోనే జగన్ ఎన్నికలలో ఓటమిని అంగీకరించేసినట్లైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేత తాను ముందుండి నడిపించాల్సింది పోయి, అభ్యర్థులను మార్చేసి ఎవరి విజయానికి వారే బాధ్యులు అన్నట్లుగా వ్యవహరించడం ఏమిటని అంటున్నారు. ఇక్కడ చెల్లని కాణీ అక్కడ చెల్లుతుందా అని అప్పట్లోనే పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి మొదలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి ఖరారు అని తేలిపోయిన తరువాత ఆ అసమ్మతి గళాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థులను ముందుండి గెలిపించలేని జగన్ తమ నాయకుడిగా ఉండటమే దురదృష్టమని, పలువురు వైసీపీ నేతలు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అలాంటి వారిలో అత్యధికులు ఈ సారి ఎన్నికలలో పోటీ చేసి ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిన వారే ఉన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్ ఇంకా వైసీపీ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా అవసరమా అనే ప్రశ్నలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి, ఆగ్రహ తీవ్రత చూస్తుంటే.. వైసీపీలో జగన్ పై తిరుగుబాటు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఇలాంటి తిరుగుబాటును ముందే ఊహించి జగన్ తనను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలని గతంలోనే భావించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జగన్ పై తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంటుంది అన్నది.. ఫలితాల వెల్లడి తరువాత వైసీపీ గెలుచుకునే సీట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఫలితాల తరువాత జగన్ పార్టీపై పట్టు పూర్తిగా కోల్పోయే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.