ఈ రోజు వి.మధుసూదన రావు (జూన్ 14) జయంతి.
ఓ తరం ప్రేక్షకులకి వీరమాచనేని మధుసూదనరావు అని చెప్తే అర్థమయ్యేది కాదు! ‘విక్టరీ’ మధుసూదనరావు అనాలి! ‘‘ఇంకేం సినిమా, గ్యారంటీగా హిట్టవుతుంది’’ అనే వారు! ప్రేక్షకులు ‘‘ఔను’’ అనుకునేలా ఆయన సినిమా తీసేవాడు! వాళ్లన్నట్టుగానే ‘దర్శకత్వం: వి.మధుసూదనరావు’ అని వాల్‌పోస్టర్ మీద రాసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టయ్యేవి! చాలా వరకు నూర్రోజులాడేయి. ఆయన మాత్రం నూటికి పదకొండేళ్ల దూరంలో ‘ప్యాకప్’ చెప్పి, వెళ్లిపోయారు! అప్పటి వరకు పౌరాణికాలంటే కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావులే ప్రామాణికం. పౌరాణికాలు తీయాలంటే వాళ్లే తీయాలి. మరో వ్యక్తి ప్రయత్నించినా- వాళ్లలాగే తీయాలి. తేడా వస్తే జనం ఒప్పుకోరు. 1965 జులై 12 వరకు పౌరాణికాలకు సంబంధించినంత వరకు ఇదే ప్రేక్షకుల మైండ్‌సెట్.
కానీ ఆ రోజు పౌరాణికాల్ని ఇలాక్కూడా తీయొచ్చునని వి.మధుసూదనరావు ‘వీరాభిమన్యు’ చిత్రం ద్వారా నిరూపించారు. ప్రేక్షకులు ఔనన్నారు. ‘దర్శకత్వం: వి.మధుసూదనరావు’ అంటే మాటలా అననుకొన్నారు. ‘వీరాభిమన్యు’ స్క్రీన్‌ప్లేలో ఆ పట్టు కనిపిస్తుంది. చిత్రీకరణలో వైవిధ్యం కనిపిస్తుంది. ఉత్తర అభిమన్యుల ప్రణయం.. నడి మధ్యలో ఘటోత్కచుడి పాత్ర… యుద్ధ సన్నివేశాలు.. విశ్వరూపం. చిలా విస్తారమైన ఇతివృత్తాన్ని, కొలతల్లో తేడా రాకుండా, మోతాదుల్లో హెచ్చుతగ్గులు లేకుండా మధుసూదనరావు మలచిన తీరు అద్భుతం. అలాగే పాటలు కూడా! జాగ్రత్తగా గమనిస్తే అంతకు ముందు వచ్చిన పౌరాణిక చిత్రాల్లోని పాటలకూ ‘వీరాభిమన్యు’లోని పాటలకూ మధ్య అంతరం కనిపిస్తుంది. వీటిలో ప్రేక్షకులు కొత్తదనం చూశారు. సన్నివేశాలకు తగ్గట్లు రాయించుకున్న పాటల్లోనూ, వాటికి కట్టిన బాణీల్లోనూ తాజాదనం, ఆహ్లాదం కనిపించాయి. మహదేవన్ సంగీతం వీరాభిమన్యుకి పెద్ద పెట్టుబడే అయ్యింది. పౌరాణిక చిత్రాల్లో మహదేవన్ సంగీతం తాలూకు ప్రతిభను ప్రేక్షకులకు తొలిసారిగా రుచి చూపించింది వి.మధుసూదనరావే!