ఏపీలో పోలింగ్ ముగిసింది. వైసీపీ మూకల అరాచకం, హింసాకాండ, బెదరింపులు, దాడులు ఇవేమీ పట్టించుకోకుండా జనం పట్టుదలతో ఓటు వేశారు. భారీ పోలింగ్ నమోదైంది. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. ఈ భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వైసీపీ ఓటమి దాదాపుగా ఖాయమైందని వారు చెబుతున్నారు.
అయితే వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు, పరిశీలకులు విశ్లేషించడం కాదు. స్వయంగా వైసీపీయే తన తీరు ద్వారా, వ్యాఖ్యల ద్వారా, ప్రదర్శిస్తున్న అసహనం ద్వారా ఓటమిని పోలింగ్ ముగియక ముందే అంగీకరించేసింది. ఇక ఆ పార్టీ అధినేత జగన్ అయితే పోలింగ్ తేదీకి చాలా ముందుగానే బేలగా ఈ సారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అంటూ తన ఆందోళనను, ఓటమి భయాన్నీ వెళ్లగక్కేశారు. ఏదో పార్టీ సమావేశంలోనే, కీలక నేతలతో మంతనాల సమయంలోనే కాదు. ఏకంగా బహిరంగ వేదికపై జగన్ ఈ మాటలు చెప్పి పార్టీ పరాజయం తథ్యమన్న సంకేతాలను జనానికే కాదు, సొంత పార్టీ క్యాడర్ కు కూడా ఇచ్చేశారు.
ఇక ఆ పార్టీ కీలక నేత, మంత్రి రోజా అయితే పోలింగ్ జరుగుతుండగనే తాను ఓడిపోబోతున్నానని ప్రకటించేశారు. నగరి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పని చేశారని చెప్పారు. ఏకంగా మీడియా ముఖంగానే ఆమె ఈ మాటలు చెబుతూ వైసీపీ పరువు గంగలో కలిపేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తరువాత మాజీ మంత్రి, నెల్లూరు నుంచి నరసరావుపేటకు వలస వచ్చి మీసం తిప్పి తొడకొట్టి కూటమికి సవాలు చేసిన వైసీపి ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేశారు. సరిగ్గా ఇవే మాటలు చెప్పకపోయినా టిడిపికి బలం ఉన్న చోట అసలు పోలీసులే లేరు. వాళ్ళను ఇష్టం వచ్చిన్నట్లు ఓట్లు వేసుకోమని వదిలేశారు. కానీ వైసీపికి బలం ఉన్న చోట వందలాది మంది పోలీసులను మోహరించి అడుగడుగునా నియంత్రించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసి అనిల్ కుమార్ వైసీపీ ఓటమి తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.
ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే మీడియా సమావేశంలో భోరున ఏడ్చినంత పని చేశారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకూ పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారనీ, మంత్రినైన తాను చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు. సాధారణంగా ఓటమి ఖరారైన తరువాతే నేతల నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయి. పల్నాడు సహా పలు ప్రాంతాలలో వైసీపీ మూకలు రెచ్చిపోయి హింసాకాండకు, దౌర్జన్యాలకు తెగబడినా తెలుగుదేశం దీటుగా ప్రతిఘటించింది. పోలింగ్ సజావుగా సాగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఎక్కడా ఇలా వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రుల్లా బేల మాటలు మాట్లాడలేదు. రీపోలింగ్ కు డిమాండ్ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం చేతులెత్తేసింది. పోలింగ్ ఏకపక్షంగా జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.
ఇవన్నీ ఒకెత్తైతే ఇలా పోలింగ్ ముగిసిందో లేదో అలా విదేశాలకు చెక్కేయడానికి జగన్ వేసుకున్న ప్లాన్, ఆయన విదేశాలకు వెడితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అంటూ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ తో జనానికి వైసీపీ ఓటమికి సాకులు, పలాయనానికి దారులు వేతుక్కుంటోందన్న సంకేతాలు ఇచ్చినట్లైంది.