ఏపీలో పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నికల సంఘం కూడా దీనిని అధికారికంగా ధృవీకరించింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు ఓటెత్తారు. అనూహ్యమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కనబరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 82 శాతానికి పైగానే పోలింగ్ జరిగినట్లు అంచనా.
అయితే రాష్ట్రంలో అత్యంత కీలకమైన, కీలక నేతలు పోటీలో ఉన్న ఆరు నియోజకవర్గాలలో మరింత ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఆ నియోజకవర్గాలు ఏమిటంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పం. కుప్పంలో 85.87 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే వైసీపీ అధినేత జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో 81.34 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో 85. 74శాతం, జనసేనాని పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన పిఠాపురంలో 86.63 శాతం పోలింగ్ నమోదైంది. ఇక నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గంలో 77.82, కాంగ్రెస్ ఏపీ అధినేత్రి షర్మిల పోటీ చేసిన కడప లోక్ సభ నియోజకవర్గంలో 78.73 శాతం పోలింగ్ నమోదైంది.
ఎగ్జిట్ పోల్స్ పై ఈ నెల 4వ తేదీ సాయంత్రం వరకూ నిషేధం అమలులో ఉన్నా భారీగా పోలైన ఓట్లు, ఓటరు చైతన్యం, ఓటేసి తీరాలన్న పట్టుదల గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజకీయ పరిశీలకులు కూడా భారీ పోలింగ్ ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తున్నదని చెబుతున్నారు. పరిస్థితులు ఇంత స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తున్నా వైసీపీ నేతలు మాత్రం విజయంపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.